“తాతయ్య చూడూ! బామ్మ నన్ను కొడ్తోంది.. దెవుడికి దండం పెట్టుకోరా! అని, అసలెందుకు పెట్టాలి తాతయ్య? నాకేమి కావాలన్నా నువ్వు కదా ఇచ్చేది, మరి నేనెందుకు దేవుడికి దండం పెట్టాలి? ” పదేళ్ళ తన మనవడి మాటలు విన్న రాఘవ ఒక్కసారిగా వులిక్కిపడ్డాడు. సరిగ్గా తను పదేళ్ళప్పుడు ఇలాగే అలోచించేవాడు, “అమ్మని ఇన్ని కష్టాలు పెడ్తున్న ఆ దేవుడికి నేనెందుకు దండం పెట్టాలి? నాకు చదువుకోడాని పుస్తకాలుండవు, అమ్మ నడిగితే డబ్బుల్లేవు” అంటుంది, తనకొచ్చే జీతం ఇంటి అవసరాలకే సరిపోతాయి అని . అప్పుడప్పుడు అమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకోవడం తను కళ్ళార చూసాడు. కాని అప్పుడు తనకి తెలీదు. అమ్మ అంత బాధలోను నాన్న! దేవుడికి దండం పెట్టుకోరా “శ్రీ రామ రామేతి రమే రామే మనోరమే .. సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాన్ననే .. అన్న శ్లోకం చెప్పుకొన్నావనుకో , విష్ణు సహస్ర నామం చదివిన పుణ్యం వస్తుంది, మన కష్టాలు తీరిపోతాయి” అని ఇదిగో ఇలాగే తన మనవడిలాగె తనూ అమ్మతో వాదన పెట్టుకొనేవాడు, కాని ఈరోజు అమ్మ చెప్పిందనో లేక తను అలా అనుకోబట్టో ఈరోజు తాని స్థానమొలో నిలదొక్కుకోగలిగాడు కదూ!! అసలు దీనికంత కారణం ఆరోజు తనకి ఆ తెల్లకాగితం దొరకడం కదూ! ఎంత అదృష్టం అసలు దొరికుండకపోతే తనకా ఆలోచన వచ్చేదా? తనీ ఈరోజు ఈ స్థితి కి వచ్చేవాడా? తన అప్పటి పరిస్థితి తలుచుకొంటేనే ఒక్కసారి జలదరింపు కలిగింది, అమ్మ ఆఫిస్ నుండి తెచ్చే కాగితాలే తనకి హోం వర్క్ కి వాటికి సరిపోయేది. పంచాయితి రాజ్ మంచినీటి సరఫరా పధకం లో భాగంగా తన గ్రామానికి మంచినీటి సరఫరా అందిచడానికి వచ్చిన ఆ అధికారులు వెళ్తూ వుండగా కిందపడేసుకొన్న తెల్లకాగితమది. అది తనకి దొరకడం తన ఈ రోజు ఈ పరిస్థితికి కారణమయ్యిందంటే అసలు నమ్మబుద్ది కావడం లేదు. చిరునవ్వులు చిందిస్తున్న తల్లి ఫొటోకి, కృతజ్ఞతా భావంతో మనసులో దండం పెట్టుకొంటూ తన ఆలోచనలని గతంలోకి పరుగులెత్తించాడు రాఘవ.
“దేవుడా.. దేవుడా.. నాకెన్నో సందేహాలు.. అవన్నీ నీకు చెప్పేయ్యాలని నీ ద్వారా తీర్చేసుకోవాలని ఇదిగో ఈ తెల్ల కాగితం పట్టుకొచ్చేసాను.. ఒక్కొక్కటి ఇందులో రాస్తాను.. మరి నా అనుమానలన్ని తీర్చేయవా??? ప్లీజ్….. ప్లీజ్….ప్లీజ్
1. రోజు అమ్మ ఆఫిస్ వెళ్ళేప్పుడు “బాబు స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకో.. “శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే..సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాన్ననే “
అని అనుకో! చదువు బాగా వచ్చేస్తుంది, మన కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పింది. ఒక్కసారేంటి ఇప్పటికి బోల్డు సార్లు , ఎప్పుడు అలా చెప్తూనే వుంటాను కాని అమ్మ అలా కష్టపడ్తూనే వుంది. నేను చెప్పడం నీకు వినపడడం లేదా? అసలు నీవెక్కడ వుంటావు? అందుకే ఈసారి నీకు ఉత్తరం రాస్తున్నా! ప్లీజ్! మా కష్టాలన్ని తీరిపోయేలా చెయ్యవా. శ్రీ రామ రామ రామేతీ …
2. నిన్న మా తెలుగు టీచర్ అందరు సమానమే పేదా .. ధనిక బేధాలు లేనే లేవు అని చెప్పారు, అవునా! మరి అలా అయితే, మరి మా పక్కింటి అంకుల్ వాళ్ళ పాప పెద్ద కాన్వెంట్ స్కూల్ లో , నేను ఇక్కడ, ఈ చిన్న బడి లో ఎందుకు చదవడం? అందరూ సమానం అన్నప్పుడు నన్నెందుకు ఆ కాన్వెంట్‍కు రానీరు?? నిన్న ఆ పాప ఇంగ్లీష్‍లో గడా గడా మాట్లాడేస్తుంటే..నాకెంత ఏడుపొచ్చిందో తెలుసా? దేవుడా !దేవుడా ! ప్లీజ్ నన్నూ ఆ స్కూల్ కి వెళ్ళేట్లు చెయవా, శ్రీ రామ రామ రామేతీ
ఇంకా చాలా కోరికలున్నాయి నాకు, కాని కాగితం నిండిపోతోంది, సరె! ఇప్పటికివి చాలులే, ఆ! మర్చిపొయాను అమ్మ ఎప్పుడు అలా ఏడవకుండా చెయవా! ప్లీజ్! ప్లీజ్! శ్రీ రామ రామ రామేతి ..నేను ఈ శ్లోకం ఎప్పుడు చెప్తునే వుంటాను..”
“రఘూ! రఘూ! అక్కడేవరో పడిపోయారు చూడు! దా! వెళ్దాము” పక్కింటి కాన్వెంటు అమ్మాయి తనకన్న రెండేళ్ళు చిన్నది హడావిడిగా చెప్తుంటే కాగితం జాగ్రత్తగా మడిచి జేబులో పెట్టుకొని ఆ వైపు పరిగెత్తాడు. తన ఫైల్ నుండి కాగితం చేజార్చుకొన్న అధికారి, ఏమయ్యిందో ఏమో పాపం అలా కిందపడిపోయి ఆయాసపడ్తున్నారు, చుట్టూ చూసాడు ఎవరన్నా కనపడ్తారేమొ అని, మిట్టమధ్యహ్నం , ఎండ నడినెత్తిమీద వుంది చుట్టుపక్కల ఎవరూ లేరు, కారు అల్లంత దూరన వుంది, డ్రైవర్ సిగరెట్ కాల్చుకొంటూ అటు తిరిగి వున్నాడు పిలిచినా వినపడదు, ఎలా ఇప్పుడు?? పరిగెత్తుకొని వెళ్ళే లోపులో ఈయనికి ఏమన్నా అయితే? అని ఆలోచిస్తూ ఏమిచెయ్యాలో అర్ధం కాక అలా చూస్తుంటే అతను అంత ఆయాసంలోను తనను చూసి ఏదో సైగ చేస్తున్నట్లుగా వుంది.. దగ్గరికి వంగి ఏంటి? అని అడిగాడు. తన చొక్కా జేబుని చూపిస్తున్నాడు, ఏముంది అని చూడగా మందుల పాకేట్ అందులోని మందులు తీసి గబ గబా అతనికి ఇచ్చి అతని బాగ్‍లో వున్న నీళ్ళు పట్టించాడు తను.
ఒక పావుగంట తరువాత కాస్త కుదుటపడినట్లుగా అనిపించిదా అధికారికి, లేచి , బాబుకి సహాయం చేసినందుకు థాంక్స్ చెప్పి ఓ పదిరూపాయల కాగితాన్ని ఇచ్చి ఏమన్నా కొనుక్కోమని చెప్పాడు “వద్దండీ” అని మర్యాదగా చెప్పిన ఆ అబ్బాయిని మురిపంగా చూసి అక్కడినుండి కదిలాడతను.
“హమ్మయ్య! గుడికి వెళ్ళి దేవుడికి రాసిన వుత్తరం హుండీ లో వెయ్యాలి ఇక ” అనుకొని జేబులో చెయ్యి పెడితే వుత్తరం దొరకలేదు. అయ్యో! వచ్చిన ఒక్క అవకాశం సద్వినియోగ చేసుకోలేకపొయినందుకు బాధపడ్తూ సాయంత్రం దాక అక్కడే గడిపి ఇంటికి పరుగెత్తాడు హోం వర్క్ గుర్తొచ్చి , ఇంటి దగ్గిర తను రాసిన వుత్తరం తో ఆ అధికారి అమ్మతో మాట్లాడుతూ, ఏమి చెప్తున్నాడతను అమ్మతో? అమ్మ ఎందుకు అలా ఏడుస్తోంది? అమ్మకి కోపం వచ్చిందా? ఇంటిదగ్గరికి వెళ్ళగానే అమ్మ నన్ను దగ్గరికి తీసుకొంది, మా నాన్నే, నా చిట్టి కన్నా అని, తనకి కూడా ఏడుపొస్తోంది, అమ్మని అలా ఏడిపించినందుకు, అతని మీద కూడ కోపం వస్తోంది, ఇంతట్లో , అతను మాటలు ” మీ బాధ నేను అర్ధం చేసుకోగలను, కాని మీ కొచ్చే జీతంతో మీ బాబుని పై చదువులకి పంపలేరు, నేను మీ బాబు కి ఏ లోటు రానివ్వను, మీరెప్పుడు కావాలంటే అప్పుడు బాబుని వచ్చి చూసుకోవచ్చు, మాకు పిల్లలు లేరు, నా ప్రాణాలు కాపాడాడు మీ బాబు , నేను దత్తత తీసుకొంటాను.. ఎంతో నెమ్మదిగా చెప్తున్న అతని మాటలకి అమ్మ తన అంగీకారం తన తడి కళ్ళతోనే తెలిపింది, కొడుకు బంగారు భవిష్యత్ కోసం చేసిన త్యాగం అది.
తనకనిపించింది తెల్ల కాగితం మహిమా అది? అమ్మని వదలడమా? ఎంత మంచివాళ్ళు తనని దత్తత తీసుకొన్నవాళ్ళు అమ్మనొదిలి తను వుండలేనని అంటే అమ్మని కూడా తమ దగ్గిర వుంచుకొని నాకే లోటు లేకుండా కన్న కొడుకులా చూసారు.. ఈరోజు తన కొడుకూ – కూతురు మంచి ఉద్యోగాలతో విదేశాల్లో స్థిరపడ్డారు అంటే ఆ కాగితం చలవే కదూ!
“చెప్పవేంటి తాతయ్య? బామ్మ దేవుడికి దండం పెట్టుకో అంటుంది చూడు” అంటూ, తనని పట్టుకొని లాగుతున్న మనవిడిని చూసి ఆలోచనల నుండి తేరుకొని, తనదగ్గిర వుండడానికి వచ్చిన మనవడిని ఎత్తుకొని బార్యతో అన్నాడు ” పెద్దయ్యాక వాళ్ళకే తెలుస్తుందిలే ఈ దేవుడు భక్తి గురించి వదిలేయి” అని.